బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది జరగకూడదనే ఉద్దేశంతో కులగణన పై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయని దీనిని బీసీ కుల సంఘాలు అర్థం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన పై అనుమానాల నివృతికి ఇవాళ ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం సమావేశం అయింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా కులగణన చేశామన్నారు. సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం ఇచ్చామన్నారు. ఈ వివరాలు వచ్చాక వచ్చిన లెక్కలు అప్ డేట్ చేస్తామన్నారు.
బీసీ కులగణన జరగడం ఇష్టం లేని కొందరూ ముస్లిం మైనార్టీలను బీసీల్లో ఎలా చూపుతారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం.. కొన్ని ముస్లిం, మైనార్టీ కులాలు బీసీలలో ఉన్నాయని దాని ప్రకారమే ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్న వారిది ఏ కులమో.. ఆ కులంలో నమోదు చేశారని స్పష్టం చేశారు.