తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోని
వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్నది. ఈ స్థానానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యతలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి పూలరవీందరికి 3,115 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు దక్కాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులు చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు 23,641 కాగా చెల్లని ఓట్లు 494గా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులే విజేతలుగా నిలువనున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేతలు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగనున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఓట్లు 11,822 కాగా అభ్యర్థులెవరూ ఆ సంఖ్యను చేరుకోలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు.