‘ఆరోగ్యమే మహాభాగ్యం-ఉద్యోగుల సంపూర్ణ ఆరోగ్యమే సంస్థకు అసలైన సంపద’ అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ ఈఎస్ఐ ఆస్పత్రి సేవలపై ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘#TGSRTC అనేది 45 వేల మంది ఉద్యోగ సమూహంతో కూడిన అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యుడైన ప్రతి ఉద్యోగి మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య భద్రత సంస్థ బాధ్యత.అందుకే ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ కూడా ఉన్నతంగా ఉంటుందని భావించి 2021లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పెద్ద పీట వేయడం జరిగింది.
తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా సంస్థ ఆధునీకరించింది. దేశంలో ఏ రాష్ట్ర ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్య పరీక్షలను నిర్వహిస్తూ.. నాణ్యమైన వైద్య సేవలను సంస్థ అందిస్తోంది. ఫలితంగానే తార్నాక ఆసుపత్రిలో గతంలో ప్రతి రోజు సగటున 600 ఓపీ ఉండగా.. ప్రస్తుతం అది 1500కి పెరిగింది. 24/7 ఫార్మసి సదుపాయాన్ని ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది.
జీవికే యాదవ్, కండక్టర్ కూకట్‌పల్లి డిపో గారు తార్నాక ఆస్పత్రి పనితీరును అక్కడ అందిస్తోన్న వైద్య సేవలను వీడియో రూపంలో తెలియపరిచి.. ప్రశంసించడం అభినందనీయం.ఆసుపత్రి విషయంలో ఆయన ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉంది’ అని స్పష్టంచేశారు.