తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పదో రోజు కొనసాగుతున్నాయి. పద్దులపై ఇవాళ చివరిరోజు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పలు అంశాలపై స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ విద్యారంగంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజురోజుకూ క్షీణించిపోతోందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై జరిగిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో 75% మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని తేలిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని తెలిపారు. 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరిజ్ఞానంలో రాష్ట్రం 36వ స్థానంలో ఉందని తెలిపిన సీఎం రేవంత్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యారంగంలో ఎంతో పురోగతి చూపాల్సి ఉందని అన్నారు. ఇందుకు అధికారులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చొరవ చూపాలని సీఎం రేవంత్ కోరారు.