తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్ సభలో వెల్లడించింది. లోక్‌సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు విషయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వినియోగంపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుత సుప్రీంకోర్టులో ఉంది. కృష్ణా ట్రైబ్యునల్2 ఇందుకు సంబంధించిన విచారణ జరుపుతోంది. కోర్టు వివాదం నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని.. అందువల్ల జాతీయ హోదా కల్పించడం కుదరదని పేర్కొంటూ ప్రతిపాదనలు రాష్ట్రానికి తిరిగి పంపినట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.