తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని అశోక్ అకాడమీ ఛైర్మన్ అశోక్ ఆరోపించారు. 563 పోస్టులు ఉంటే 200లకు పైగా గ్రూప్ 1 పోస్టులు బ్యాక్ డోర్లో అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఆగమాగం అని.. అల్ ఇండియా స్టేట్ టాపర్‌కి 49.5 శాతం మార్కులు వస్తాయి.. కానీ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్‌లో 250 మందికి 50 శాతం మార్కులు రావడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. కచ్చితంగా ఈ పరీక్షలను బయట వారితో రాయించారని అన్నారు.
“అధికారంలోకి వచ్చాక 57 వేలుకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్లు 12 వేలు మాత్రమే. మిగతావి అన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు. మీరు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే ముఖ్యమంత్రి కాదు నియామకాల ముఖ్యమంత్రి. జస్ట్ పత్రాలు మాత్రమే ఇస్తారు. మాటలు ద్వారా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. ఆ మాటల ద్వారా పబ్బం గడుపుతున్నారు.” అంటూ అశోక్ రాష్ట్ర సీఎంను విమర్శించారు.