మయన్మార్, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ సహా పలు చోట్ల భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వరుస భూకంపాలతో 59 మంగి మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి. మయన్మార్ లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది గాయపడినట్లు సమాచారం. ఇక థాయ్ లాండ్ లో నలుగురు మృతి చెందగా 81 మంది గాయపడినట్లు తెలిసింది. భూకంపం నేపథ్యంలో థాయ్ లాండ్ లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది.
స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని గమనిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈ ప్రకృతి విపత్తులో గాయపడినట్లు తమ దృష్టికి రాలేదని ఎంబసీ స్పష్టం చేసింది. అయితే భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. థాయ్‌లాండ్‌లోని భారతీయులు ఎమర్జెన్సీ నంబర్ +66 618819218ను సంప్రదించాలని పేర్కొంది. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్ మాయీ నగరంలోని కాన్సులేట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్లు ఎక్స్ లో పోస్టు ద్వారా వెల్లడించింది.