హరి.. హర.. ఏ నామమైతే ఏమిటి భక్తికి హరి ఎల్లప్పుడు దాసోహుడే. ఆయన నిరంతరం భక్తుల సంరక్షణ చేస్తూ లోకపాలన చేస్తాడు. దానికి ఒక ఉదాహరణ… అంబరీషుడు పరమ హరిభక్తుడు. అంతటి భక్తుడిపట్ల దుర్వాసుడు అతి చిన్న కారణానికే తన సహజమైన అమిత కోపం ప్రదర్శించాడు. తన జడ పాయతో శక్తిని పుట్టించి ఆయనపైకి వదిలాడు. అంబరీషుడు మాత్రం ‘హరిని నమ్ముకున్నవాడికి ఏ హానీ కలగ’దని హరి నామస్మరణ చేస్తూ ధీమాగా ఉన్నాడు. దుర్వాసుడి అహంకారం, అంబరీషుడి నమ్మకం రెండింటినీ చూసిన శ్రీహరి- తన భక్తుడి నమ్మకాన్ని గెలిపించాలని తలచి, సుదర్శన చక్రాన్ని ఆజ్ఞాపించాడు.
అది ముందుగా దుర్వాసుడు పుట్టించిన శక్తిని దహించింది. తరవాత అతడివైపు మరలింది. దాని బారినుంచి తప్పించుకోవాలని ఎక్కడెక్కడికో వెళ్లాడు దుర్వాసుడు. అయినా విడవకుండా వెంటాడుతూనే ఉంది. బ్రహ్మను, శివుణ్ని శరణు కోరాడు. వారు అతణ్ని రక్షించడం తమవల్ల కాదన్నారు. చివరికి చక్రాన్ని వదిలిన విష్ణువునే శరణు వేడాడు. అప్పుడాయన- ‘ఓ మహామునీ! నా భక్తులకు ఆపద వస్తే కాపాడటం నా ధర్మం. వారికి ఎవరైనా కీడు తలపెడితే నేను సహించను. వారికంటే ఇంకెవరూ నాకు ఎక్కువ కాదు. ఇప్పుడు నువ్వు నా శరణు కోరి వచ్చావు కాబట్టి చెబుతున్నాను. నువ్వు ఏ భక్తుడికి హాని తలపెట్టావో అతణ్నే శరణు వేడుకో. నీకు రక్షణ దొరుకుతుంది’ అన్నాడు. దుర్వాసుడు అలా చేశాక సుదర్శన చక్రం అతణ్ని విడిచిపెట్టింది.
భాగవతం ద్వితీయ స్కంధం రెండో అధ్యాయంలో శుకమహర్షి పరీక్షిత్తుకు భక్తి మార్గమే ముఖ్యమని చెబుతూ- ప్రతి క్షణం భగవధ్యానం చేస్తూ, ఆయన పట్ల పరిపూర్ణ భక్తి కలిగి, మనసును నియంత్రించుకుని శుద్ధ చైతన్య రూపుడైన పరబ్రహ్మయందు లీనమైన మనసు కలవాడైతే ఆత్మానందాన్న పొందుతారు’ అని చెప్పాడు.
‘భాగవతాన్ని వినేవారు, చదివేవారు జీవితంలో ఎప్పుడూ ఈశ్వరుణ్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం కలిగినా దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా వారికి అహం ఏర్పడదు’ అని భాగవత (సంస్కృత, అనువాద)కారులు చెబుతారు. వారే ఏకాదశ స్కందం అయిదో అధ్యాయంలో ‘భక్తిహీనులు’ ఏ రకమైన గతులు, స్థితులు పొందుతారో సవివరంగా తెలిపారు. ఆయా విషయాలు చదివినవారికి లోతుపాతులు స్పష్టంగా బోధపడతాయి. భగవద్భక్తికి మించింది సృష్టిలో మరేదీ లేదు. అందువల్ల మనం ఏ పనిమీద ఉన్నా భగవంతుడి స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. హరి తనను నమ్ముకున్న భక్తుడును ఆదుకున్న కథ ఇదే.
– కేశవ