రాజధాని రైతుల ఆందోళనలు 49వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ (జేఏసీ) నేతలు, రైతులు ఈరోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.
‘రాజధాని నిర్మాణం కోసమని మేము వేలాది ఎకరాల భూములు ఇచ్చాం. ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. మేం ఆందోళన వ్యక్తం చేస్తే తప్పుడు కేసులు బనాయించారు. దాడులు చేస్తున్నారు’ అంటూ తమ గోడు వినిపించుకున్నారు. రాజధాని తరలిపోకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్రపతి, ఇతర బీజేపీ పెద్దలు, సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు.