అండర్ 19 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో మన కుర్రాళ్ళు వికెట్ పడకుండా లక్ష్యాన్ని చేధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీం ఇండియా ఏ మాత్రం తడబడకుండా విజయం సాధించింది. ఓపెనర్లు జైస్వాల్, సక్సేనా అదరగొట్టారు.
జైస్వాల్ సెంచరి చేసి ఆకట్టుకోగా సక్సేనా అర్ధ సెంచరీతో రాణించాడు. ఏ మాత్రం తడబడకుండా పాకిస్తాన్ పేస్ ఎటాక్ ని ఇద్దరు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. తొలుత ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పది ఓవర్లలో 30 పరుగులే చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా ఇద్దరు దూకుడు పెంచారు. జైస్వాల్ అయితే దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు.
సిక్సులు ఫోర్లతో మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరగకుండా ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడు సిక్సులు 8 ఫోర్లతో 176 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సక్సేనా 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. గురువారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే సెమి ఫైనల్ విజయం సాధించిన జట్టుతో ఫైనల్ లో తలపడనుంది.