తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. మోదీ వ్యాఖ్యలను ఖండించిన ఆయన ప్రధాని చిల్లర కామెంట్స్ చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై విషం కక్కడం మొదటి నుంచి మోదీకి అలవాటు అని వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
“తెలంగాణలో కాంగ్రెస్ పాలన కాదు యూపీలో బీజేపీ చేస్తోంది బుల్డోజర్ పాలన. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సన్న బియ్యం, ఉచిత కరెంట్, ఉద్యోగాల కల్పన వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయం చేస్తోందంటూ ప్రధాని వ్యాఖ్యలు చేయడం సరికాదు. దేశ ప్రధానిగా మోదీ.. అన్ని రాష్ట్రాల పట్ల సమాన స్ఫూర్తిని పాటించాలి. కానీ ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే పీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంటే మోదీకి కళ్లమంట.” అని అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.