మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్టయ్యాడు. ఇటీవల ఓ హోటల్‌పై డ్రగ్స్ రైడ్ జరిగిన సమయంలో షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ (ఏప్రిల్ 19వ తేదీ 2025) పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎందుకు పరారైనట్లు ప్రశ్నించినట్లు తెలిసిందే. అలాగే డ్రగ్స్ వినియోగంపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారించిన అధికారులు వెంటనే అరెస్టు చేశారు.
ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేయడానికి వెళ్లగా.. వారి బృందం హోటల్‌కు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. మూడో అంతస్తులో ఉన్న అతను.. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో కిటికీలోంచి రెండో అంతస్తులోకి దూకి పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీ వైరల్ అయింది. మరోవైపు, ఆయన డ్రగ్స్ తీసుకుంటారంటూ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు రాగా తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ అలోషియన్ సైతం ఆయనపై ఇదేతరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.