బిహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి ఓ అవకాశవాద కూటమి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నీతీశ్ కుమార్ సీఎం కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని.. ఆయన తరచూ కుర్చీలాట ఆడుతుంటారని విమర్శించారు. బిహార్‌లోని బక్సర్‌లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొన్న ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే సర్కారును అధికారం నుంచి తప్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బిహార్‌లో నీతీశ్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు అని ఇది రాష్ట్ర ప్రజలకు మేలు చేయదని ఖర్గే వ్యాఖ్యానించారు. ఓవైపు నీతీశ్ కుర్చీలాట ఆడుతుంటే.. మరోవైపు ప్రధాని మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారని అన్నారు. బిహార్‌కు ఇస్తామన్న రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ హామీ ఏమైందని ఖర్గే ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు నిలదీయాలని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాగఠ్‌బంధన్’కు ఓటేయాలని, ఎన్డీయే సర్కారు పీఠాన్ని కూకటి వేళ్లతో పెకిలించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.