ఢిల్లీలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు పిల్లలను రక్షించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పిల్లల అక్రమ రవాణాపై కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలు సమాజానికి ఎంతో ప్రమాదకరమని.. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాలని వ్యాఖ్యానించింది. నవజాత శిశువులను రూ.లక్షలకు అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
ఆరుగురు చిన్నారుల ఆచూకీని తప్పకుండా గుర్తించాలని.. పిల్లలను అమ్ముతున్న, కొంటున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వారంతా సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారని.. పిల్లల అక్రమ రవాణాదారులు.. హంతకులకంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేవారు.. ఆ నేరాలకు మళ్లీ మళ్లీ పాల్పడుతున్నారని.. వారు ఈ సమాజానికి మరింత ప్రమాదకరమైన వారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది దాదాపు రెండు వేల పిల్లల అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయని జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదికలు వెల్లడించాయి.