మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌పై పెట్టిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంత మందిపై మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఇవాళ కేటీఆర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని.. రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని లాయర్ కోర్టుకు వివరించారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపులా వాదనలు ముగిసిన తర్వాత కేటీఆర్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో కేటీఆర్ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది.