తెలంగాణ రాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. గురువారం పలు జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వేడిగా మారింది. అక్కడ ఏకంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లాలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు కూడా 45.2 డిగ్రీల చొప్పున తీవ్రమైన వేడిని చవిచూశాయి. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఆసిఫాబాద్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

దక్షిణ తెలంగాణలోని నల్గొండ జిల్లాలోనూ ఉష్ణోగ్రత 44.9 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఉత్తర తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత, కరీంనగర్ జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. నగరంలోని ఐఎస్ సదన్ ప్రాంతంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైటెక్ సిటీ ప్రాంతమైన మాదాపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
వాతావరణ శాఖ అధికారులు రానున్న రోజుల్లోనూ ఇదే తరహా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తగినంత నీరు త్రాగటం, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించటం, తలకు టోపీ లేదా గొడుగు ఉపయోగించడం వంటి చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అవసరమైన సూచనలు జారీ చేసింది.