దక్షిణ ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కైసర్-ఐ-హింద్ భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీల కేసులతో సంబంధమున్న కొన్ని దర్యాప్తు పత్రాలు దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన ఈడీ అధికారులు, దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. “అన్ని కీలక పత్రాలు డిజిటల్ ఫార్మాట్లో భద్రపరచబడ్డాయి. అంతర్గత కేంద్రీకృత రికార్డు వ్యవస్థలో ఆధారాలు సురక్షితంగా ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ఫిర్యాదులకు సంబంధించిన అసలు పత్రాలు కోర్టుల్లో ఉన్నందున విచారణ ప్రక్రియలో ఆటంకం ఉండదు” అని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భద్రతా సిబ్బంది మంటలు గమనించిన వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. దాదాపు 10 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం గ్రౌండ్, మొదటి అంతస్తుల్లోని కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయని, నాలుగో అంతస్తులో ఉన్న విభాగాన్ని జన్మ్ భూమి ఛాంబర్స్లోని పాత ప్రాంతీయ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.