ఛత్తీస్గఢ్లో ఇటీవల చోటుచేసుకున్న ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న సైనిక చర్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలను మావోయిస్టుల పేరిట టార్గెట్ చేసి పిట్టల్ని కాల్చినట్లుగా చంపుతున్న కేంద్ర బలగాల తీరు హింసాత్మకంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “సాయుధ పోరాట కాలంలో కూడా ఇంత దాష్టీకాలు జరగలేదు. ఇది ప్రజాస్వామ్యంలో చోటు చేసుకోవాల్సిన వ్యవహారం కాదు. మోడీ, అమిత్ షాల ఫాసిస్ట్ పన్నాగాల మధ్య దేశంలోని భావప్రకటనా స్వేచ్ఛ తీవ్రమైన దెబ్బతింటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
“మావోయిస్టులు దోపిడీ చేస్తున్నారా? అవినీతి చేస్తున్నారు? అడవుల్లో వనరులను దోచుకుంటున్నారా? కార్పొరేట్ శక్తులకు ఎదురు నిలుస్తే నేరమా?” అంటూ కూనంనేని ప్రశ్నించారు. వరవర రావు, ప్రొఫెసర్ సాయిబాబాల వంటి వారిని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “మోదీని వరవరరావు హత్య చేస్తారా? ప్రశ్నించినందుకే అరెస్టా?” అని నిలదీశారు. మావోయిస్టులు కాదు, దేశవ్యాప్తంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు మా చుట్టాలే. చంపే హక్కు ఎవరికీ లేదు. చర్చలకు వస్తామంటున్నా చంపడం అంటే అది ఎటువంటి రాజ్యాంగబద్ధమైన ధోరణి కాదని, దేశంలో ముస్లింలు ఉండకూడదు, కమ్యూనిస్టులు ఉండకూడదు, ప్రశ్నించే వారుండకూడదు అన్నది బీజేపీ సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. “ఎవరికి దుర్మార్గత్వం ఎక్కువ? ప్రజల కోసం పోరాడే వారికా? లేక గోద్రా అల్లర్లలో జైలుకెళ్లిన అమిత్ షాకా..? అని నిలదీశారు.