పాకిస్తాన్ విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోంది : కిషన్ రెడ్డి

-

పాకిస్తాన్ విధానాలను అనుసరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశానికి కీలక సమయంలో ప్రధాని మోదీని కించపరిచేలా కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పెహల్గాం ఘటన తరువాత దేశమంతటా కోపావేశం మంటలెత్తుతోందని, ఈ సమయంలో ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం పాకిస్తాన్ మంత్రులు మాట్లాడే భాషలో మాట్లాడుతుండటం దురదృష్టకరమని అన్నారు. పాక్ మంత్రుల మాటల్ని కాంగ్రెస్ నేతలు సమర్థించడమే కాకుండా, వారి ట్వీట్లు పాకిస్తాన్ లోనివారు రీట్వీట్ చేయడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా పాక్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని చెప్పారని, ఈ సమయంలో దేశ సైన్యం, కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రధానిని టార్గెట్ చేస్తూ అసభ్యంగా సోషల్ మీడియా పోస్టులు చేస్తోందని, ‘గాయబ్’ అంటూ పోస్టర్ రూపొందించడం కాంగ్రెస్ లో పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని గుర్తుచేసిన కిషన్ రెడ్డి, మజ్లిస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ – బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత అభివృద్ధి బాటలోకి వెళ్లిందని, కానీ దేశంలోని కొన్ని అంతర్గత శక్తులు మరియు పాక్ శక్తులు ఈ శాంతిని అంగీకరించలేకపోతున్నాయన్నారు. పెహల్గాం ఘటనలో నిర్దోషులైన హిందూ, ముస్లిం పౌరుల్ని కిరాతకంగా హత్య చేయడం దేశాన్ని ఒక్కటిగా కలిపిందన్నారు. దేశం శాంతి, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ, ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news