ఉత్తర్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం అక్రమ మసీదులు, గుర్తింపు లేని మదర్సాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇండియా-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అనధికారిక మతపరమైన నిర్మాణాలపై శుక్రవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. జిల్లా అధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్స్ (SSB) సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ చర్యల క్రమంలో మహారాజ్‌గంజ్ జిల్లాలో 11 మదర్సాలను సీజ్ చేయగా, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులు, మందిరాలు , ఇతర భవనాలను కూల్చివేశారు.
శ్రావస్తి జిల్లాలో గుర్తింపు లేని 41 మదర్సాలను మూసివేశారు. రెవెన్యూ కోడ్ సెక్షన్ 67 ప్రకారం, ఇండో-నేపాల్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలో 139 అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించామని అధికారులు వెల్లడించారు. ఇటు బహ్రైచ్ జిల్లాలోని రుపైదిహ్, మోతీపూర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయి. యూపీ ప్రభుత్వం ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో ముందడుగు వేసింది.