ఐపీఎల్ సమరంలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటర్ల బాదుడుకు వేదికైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 213 పరుగులు చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది బెంగళూరు. ఈ ఇన్నింగ్స్‌లో ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది వెస్టిండీస్ వీరుడు రోమారియో షెఫెర్డ్. కేవలం 14 బంతుల్లోనే మెరుపు వేగంతో 53 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. ఇక చివరి ఓవర్‌లోనూ 21 పరుగులు రాబట్టి తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అంతకుముందు యువ బ్యాటర్ జాకోబ్ బెతెల్ తన మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 55 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించినప్పటికీ, మతీషా పతీరాణ బౌలింగ్‌లో బ్రెవీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ కూడా తన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి దూకుడు మీదున్న కోహ్లీని శామ్ కరణ్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదర్ (11), జితేశ్ శర్మ (7), టిమ్ డెవిడ్ (0) పెద్దగా రాణించలేకపోయారు.
బౌలింగ్ విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే లంకన్ యార్కర్ల స్పెషలిస్ట్ మతీషా పతీరాణా 3 కీలకమైన వికెట్లు తీసి కాస్త ఊరటనిచ్చాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్, పేసర్ శామ్ కరణ్ చెరో వికెట్ పడగొట్టారు.
మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్లదే హవా కొనసాగింది. బెంగళూరు బ్యాటర్లు చెన్నై బౌలర్లను ఊచకోత కోయడంతో చెన్నై ముందు 214 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.