టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ : బాలయ్య

-

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి టేకులోడులోని ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే, ఇందిరమ్మ కాలనీలో గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల ఆధారంగా 237 మంది లబ్దిదారులకు స్వాధీన పత్రాలను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలను వేదించాలంటే ఖబర్దార్ అంటూ ప్రత్యర్థులకు పరోక్ష హెచ్చరిక ఇచ్చారు. హిందూపురం టీడీపీకి పటిష్టమైన బేస్ అని స్పష్టం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ హిందూపురాన్ని రెండో పుట్టినిల్లు లా భావించేవారని, తన వారసత్వంగా నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతగా పని చేస్తున్నానని తెలిపారు.

బాలకృష్ణ మాట్లాడుతూ, “రాయలసీమ గడ్డే నా బలమైన బేస్. హిందూపురం అభివృద్ధి నా లక్ష్యం. చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నేత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏడాది లోపే 50 కోట్ల రూపాయల పనులు చేశాం,” అని వెల్లడించారు. అంతేకాక, హిందూపురానికి శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచే పనులు కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 1984లో ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసిన స్మరణను గుర్తు చేస్తూ, అభివృద్ధి ధోరణి కొనసాగుతుందని స్పష్టంచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news