గోదావరిఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నక్సలిజం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, కులగణన వంటి ప్రధాన అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నక్సల్స్ సానుభూతిపరులపై తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్, హరగోపాల్, వరవరరావుల ప్రస్థానం ఏం సాధించిందని ప్రశ్నించారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చి, అమాయకుల ప్రాణాలు తీసే విధానాలను ప్రోత్సహించారని ఆరోపించారు. తుపాకీ ధారకులు చేసిన హత్యలకు వారు ఏ సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిని తప్పుబట్టిన బండి సంజయ్, మావోయిస్టుల విషయంలో ఆ పార్టీ తటస్థత కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం మాటలకే పరిమితం చేసుకుంటూ, చేతల్లో మాత్రం తీవ్రవాద సిద్ధాంతాలను సమర్థించడం సరికాదన్నారు. పదేళ్ల పాటు అమాయకులను చంపిన వారితో చర్చలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు తుపాకీ వదిలి, సమాజంలో కలవాలని సూచించారు.
పౌర హక్కుల సంఘాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే, మావోయిస్టులకు సరైన మార్గం చూపించండి, శాంతియుత మార్గాన్ని అంగీకరింపజేయండి అని సూచించారు. కులగణన విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినది కులగణన కాదని, కేవలం ఓ సర్వే మాత్రమేనని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కులగణన అంటే ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరించాల్సిన ప్రక్రియ. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, జాతీయ జనగణనలో కులగణనను నిర్వహించేందుకు కృషి చేస్తోందని, ఇది బీసీలకు న్యాయం చేయడంలో కీలకమైన ముందడుగు అవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.