ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంతో గుడ్ న్యూస్ చెప్పింది. వివాహిత మహిళలకు ఇచ్చే మెటర్నిటీ లీవ్‌ను 120 రోజుల నుంచి 180 రోజులకి పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఇలాంటి సెలవులు కేవలం ఇద్దరు పిల్లలకే వర్తించాలనే నిబంధనను పూర్తిగా తొలగించింది. ఈ తాజా నిర్ణయంతో, పిల్లల సంఖ్య ఎంతైనా సంబంధం లేకుండా, ప్రతీ మహిళా ఉద్యోగికి 180 రోజుల ప్రసూతి సెలవులు వర్తించనున్నాయి. ఇదివరకే ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నప్పటికీ, తాజాగా ఉత్తర్వులు విడుదల కావడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల సమయంలో కూటమి నేతలు మహిళా ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేస్తూ మెటర్నిటీ లీవ్ పెంపు వంటి శుభ నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను ఆదర్శంగా తీసుకొని, ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళా ఉద్యోగులకు సమానంగా 180 రోజుల సెలవులు వర్తించనున్నాయి. ఈ విధానం మహిళలు ఉద్యోగ జీవితాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా కొనసాగించేందుకు ఉపయుక్తమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.