టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానం నుంచి కవిత తన నామినేషన్ ను దాఖలు చేయనుంది. ఈ ఎన్నికలో ఆమె గెలిస్తే 2022 జనవరి వరకూ ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతారు…
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న జెడ్పీటీసీ,ఎంపీటీసీలు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 95 శాతం పైగా టీఆర్ఎస్ వారే ఉండటం వల్ల ఆమె ఎన్నిక లాంఛనమే అనిపిస్తోంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా కవిత పేరుని ముందుకు తీసుకొచ్చింది.
2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. అయితే మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతిలో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే…అయితే ఆమెకు రాజ్యసభ ఇస్తారని ఇన్నాళ్లూ ప్రచారం జరగ్గా ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయనున్నారు.