తెలంగాణలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మల్కాజ్గిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, KMM, BPL జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, హనుమకొండ, కామారెడ్డి, అదిలాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, రంగారెడ్డి, వరంగల్, సిద్దిపేట్, నల్గొండ, ASF, JNG జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. రెండు రోజులపాటు హైదరాబాద్ లాంటి మహా నగరాలలో ఆఫీసులకు సెలవు ఇచ్చారు. ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేశారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.