సంగీతం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు ఇది మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన సాధనం. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సంగీతం వినడం వల్ల శరీరం, మనసుపై సానుకూల ప్రభావాలు ఉన్నాయని నిరూపించారు. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ఆధునిక పాప్ సంగీతమైన, ఆనందాన్ని అందించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. మరి అలాంటి ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం..
మానసిక ఒత్తిడి నిర్మూలన: సంగీతం వినడం వల్ల శరీరంలో కార్టీసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయి తగ్గుతుంది. శాంతియుతమైన సంగీతం, శాస్త్రీయ సంగీతం మనస్సును శాంతి పరుస్తుంది మరియు ఆందోళన తగ్గిస్తుంది. 2013లో జర్మల్ ఆఫ్ అడ్వాన్స్డ్ నర్సింగ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం శస్త్ర చికిత్సకు ముందు సంగీతం విన్న రోగుల్లో ఒత్తిడి, ఆందోళన స్థాయి తగ్గాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం రోజుకు 20 నిమిషాలు శాంతియుతమైన సంగీతం వినండి.

మానసిక ఆరోగ్యం మెరుగుదల : సంగీతం డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది డోపమైన్ సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల చేస్తుంది. 2017 లో ఒక అధ్యయనంలో సంగీతం వినడం డిప్రెషన్ ఉన్న వారిలో మానసిక స్థితి మెరుగుపరచడం గమనించారు. ఉత్సాహవంతమైన సంగీతం మీకు ఇష్టమైన పాటలు వినటం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నాణ్యమైన నిద్ర: ఈ రోజుల్లో నిద్రలేని సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటివారు శాంతియుతమైన సంగీతం వినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపరడమే కాక రిలాక్సేషన్ కలుగుతుంది. నిద్రకి ముందు అందుబాటులో గల స్లీపింగ్ మ్యూజిక్ వినడం మనసును రిలాక్స్ చేస్తాయి. రాత్రి నిద్ర పోయే ముందు 15 నిమిషాలు సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీతం వినండి.
ఆరోగ్య ప్రయోజనాలు: సంగీతం రక్తపోటును తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పులు ఉన్న వారిలో ఎక్కువమంది సంగీతం వినడం వలన నొప్పి స్థాయి తగ్గినట్లు గుర్తించారు. వ్యాయామం సమయంలో మంచి సంగీతం వినడం శారీరక శ్రమను మరింత ఆనందదాయకం చేస్తుంది.
సంగీతం వినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. శారీరక ఆరోగ్యం మెదడు పనితీరు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదే సమయంలో ఇది ఆనందం, ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. రోజువారి జీవితంలో సంగీతాన్ని భాగం గా చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యం మరియు ఆనందాన్ని రెండిటిని పొందవచ్చు.