హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణమాసం అనేది ఆధ్యాత్మిక చింతనకు, భక్తికి ఎంతో ప్రాధాన్యత కలిగిన పవిత్రమైన నెల. ఈ మాసంలో స్త్రీలు ఎక్కువగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, మహా శివునికి పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఇక ఈ మాసంలో చాలామంది ఉపవాసం పాటిస్తుంటారు. కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు ఉపవాసం అంటే, దాని వెనుక కొంత ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. ఉపవాసం అనేది మన శరీరాన్ని మనసుని శుద్ధి చేసుకునే గొప్ప సాధనం. శరీరానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే ఆత్మ ను భక్తి మార్గంలో అనుసంధానం చేయడానికి ఉపవాసం ఎలా సహాయపడుతుంది అనేది మనము తెలుసుకుందాం..
ఉపవాస మార్గాలు: శ్రావణ మాసంలో ఉపవాసం పాటించే విధానాలు రకరకాలుగా ఉంటాయి. కొందరు నెల మొత్తం ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మరికొందరు సోమవారం శుక్రవారం శనివారం రోజున మాత్రమే ఉపవాసం ఉంటారు. మరికొందరు పండ్లు పాలు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఎక్కువమంది ఒకపూట భోజనం చేయడం మనం గమనించవచ్చు. ఈ నియమాలు భగవంతుడి పట్ల మనకున్న భక్తిని సూచిస్తాయి. ముఖ్యంగా స్త్రీలు తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఆరోజు ఉపవాసం ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం కలుగుతాయి అని నమ్ముతారు. ఈ ఉపవాసం వల్ల మనలో నిగ్రహశక్తి పెరుగుతుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.

శారీరక మానసిక ప్రయోజనాలు: శ్రావణమాసం ఉపవాసం వల్ల అనేక శారీరక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉపవాసం శరీరంలో విష పదార్థాలను బయటికి పంపి జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. ఫలితంగా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది ఒకపూట భోజనం చేయడం మెటబాలిజం పెరిగి బరువు అదుపులో ఉంటుంది. ఉపవాసం కేవలం శరీరం వరకే పరిమితం కాదు ఇది మనసుపై ప్రభావాన్ని చూపుతుంది. మనసులోని ఆందోళన, ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా మారుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తద్వారా మన ఆలోచనలు మరింత స్పష్టంగా, సానుకూలంగా పాజిటివ్ గా ఉంటాయి.
భగవంతుడితో అనుసంధానం: అసలు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఆహారం భౌతిక సుఖాల పట్ల ఉన్న కోరికలను తాత్కాలికంగా పక్కనపెట్టి మనస్సును పూర్తిగా దైవం పై కేంద్రీకరించడం ఈ ఉపవాసం ముఖ్య ఉద్దేశం. శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తూ ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్మకం రోజంతా ‘శ్రీ మాత్రే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉపవాస దీక్ష చేసి సాయంత్రం దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని రావడం వలన మనసు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటుంది.
చివరగా శ్రావణమాస ఉపవాసం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు అది మన ఆత్మను మన శరీరాన్ని మనస్సును పవిత్రం చేసే ఒక శక్తివంతమైన సాధనం. ఈ ఉపవాసం ద్వారా ఆధ్యాత్మిక శక్తి, శారీరక ఆరోగ్యం మన జీవితాన్ని ఉన్నతంగా సంతోషంగా మారుస్తాయి.