తెలంగాణ లో రెండో విడత పల్లె జాతర కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి అడ్లూరితో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,198 కోట్ల వ్యయంతో రూ.1.15 లక్షల పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మేకల, గొర్రెల షెడ్డు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు వీటిలో ఉన్నాయని వెల్లడించారు.
ఈ పనులు ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామాల రూపు రేఖలు మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పనుల జాతరలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగ్గా పాల్గొనాలని కోరారు. మరోవైపు మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి విబేదాలు లేవని స్పష్టం చేశారు సీతక్క. సమ్మక్క, సారలమ్మల మాదిరిగా తాము అక్కాచెల్లెల్లుగా కలిసే ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.150కోట్లు కేటాయించినట్టు అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.