తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో ఇటీవలే చేపట్టిన నియామకాల ప్రక్రియలో భాగంగా కొత్త మరో 1623 పోస్టులు భర్తీ కానున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రుల్లో నెలకొన్న స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను తీర్చేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
దీంతో ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నియామకంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య భారీగా పెరుగనుంది. పల్లెలకు కూడా స్పెషాలిటి వైద్య సేవలు అందనున్నాయి. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు మరింత మెరుగుకానున్నాయని ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.