హిందూ సంప్రదాయంలో పూజకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాక పూజలో ఉపయోగించే పూలకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దేవతకు ఇష్టమైన పుష్పాలు వేరువేరుగా ఉంటాయి. మనం సమర్పించే పూలు కేవలం విగ్రహాల అలంకరణ కోసమే కాదు వాటి సువాసన, రంగులు ఆ దేవత శక్తిని ఆకర్షించి పూజకు మరింత ఆధ్యాత్మికతను చేకూరుస్తాయి. భక్తితో సమర్పించే ఒక పువ్వు కోట్లరేట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలో తెలుసుకొని పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయంలో ప్రతి పువ్వు వెనుక ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నమ్మకం ఉంటుంది. అందుకే పూజ చేసేటప్పుడు ఏ దేవుడికి ఏ పువ్వు ని సమర్పించాలో ముందుగానే తెలుసుకుంటారు. హిందూ సంప్రదాయంలో మొదటి పూజగా గణపతి ని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది.
గణపతి: వినాయకుడికి ఎర్రమందారం అంటే చాలా ప్రీతి మందార పూలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి, ప్రతి బుధవారం గరికను కూడా వినాయకుడికి సమర్పిస్తారు.
శివుడు: శివుడికి నల్ల కలువ పువ్వులు బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం. ఈ రెండింటితో శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మల్లె చామంతి గులాబీలు శివునికి ఇష్టమైన పుష్పాలుగా చెబుతారు. ప్రతి సోమవారం వీటితో పూజ చేయడం శుభప్రదం.

విష్ణువు : శ్రీమహావిష్ణువుకు తులసి ఆకులు చాలా ఇష్టం తులసి తో పూజిస్తే విష్ణు త్వరగా ప్రసన్నుడవుతాడు. అంతేకాక కలువ పూలు పసుపు రంగు పూలు విష్ణువుకు ప్రీతిపాత్రం. ప్రతి శనివారం మహావిష్ణువుకు ఈ పూలతో పూజ చేయడం శుభప్రదం.
లక్ష్మీదేవి : ఐశ్వర్య దేవత అయినా లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం లక్ష్మీ పూజలో కమలాన్ని ఉపయోగిస్తే అష్టైశ్వర్యాలు ధనం, సమృద్ధిగా లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
సరస్వతి: జ్ఞానదేవత అయిన సరస్వతికి తెల్లటి మల్లె చామంతి పువ్వులు సమర్పిస్తారు తెలుపు రంగు స్వచ్ఛతకు జ్ఞానానికి ప్రతీక అందుకే సరస్వతికి తెలుపు రంగు పూలు అంటే ఇష్టం.
హనుమంతుడు: హనుమంతునికి మల్లె మందారం జాజిపూలు అంటే చాలా ప్రీతి.ఈ పూలతో పూజిస్తే భయం ఆందోళనలు తొలగిపోయి ధైర్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక హనుమంతుడికి ప్రతి మంగళవారం తమలపాకులతో పూజ చేయడం శుభప్రదం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి : స్వామికి ఎర్రగన్నేరు జాజిపూలు ఇష్టం ఈ పూలను సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి.
దేవతలకు పూలను సమర్పించేటప్పుడు వాడిపోనివి సువాసన గలిగినవి శుభ్రమైన పూలను మాత్రమే సమర్పించాలి. ఏ పూలతో పూజ చేస్తున్నాం అన్నది ప్రధానం కాదు భక్తి ప్రధానం.