ఎక్కువమంది ఉదయం లేవగానే మళ్ళీ అదే పని అదే రొటీన్ అని నిరుత్సాహంగా ఉంటారు. అంతేకాక ఈరోజు ఏమవుతుందో నేను చేసే పని మధ్యలో ఆగిపోతుందేమో, ఇంకేదో జరిగిపోతుంది అని నెగటివ్ ఆలోచనలతో ఎప్పుడూ ఉంటారు. ఇది వారిలోని నిరుత్సాహాన్ని పెంచుతుంది. అయితే కొన్ని అలవాటులను మార్చుకోవడం ద్వారా మనం పాజిటివ్ గా, ఉత్సాహంగా ఉండవచ్చు. ఉదయాన్నే మనం చేసే చిన్న చిన్న పనులు మన రోజును ఎంతో ఉత్సాహంగా ఉంచుతాయి. మన మనసు, శరీరం రెండిటిని సరి చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీ ఉదయాన్నే మార్చుకొని రోజంతా ఆనందంగా ఉండడానికి కొన్ని మార్గాలను తెలుసుకోవడం ముఖ్యం మరి అవేంటనేది చూద్దాం..
ధ్యానం: ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోండి శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మీలోని ఒత్తిడిని ఆందోళన తగ్గిస్తుంది అలాగే నెగిటివ్ ఆలోచనలను మనసు నుంచి దూరం చేస్తుంది. పాజిటివ్ శక్తిని పెంచుతుంది.
వ్యాయామం: ఉదయం లేవగానే కొద్దిసేపు ఎక్ససైజ్ చేయడం వల్ల శరీరానికి మనసుకి మంచి ఉత్సాహం కలుగుతుంది. ఉదయాన్నే వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఎండార్పిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి ఇవి మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజంతా చురుగ్గా ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

థాంక్స్ చెప్పడం: మన జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఒక డైరీలో రాసుకోవడం లేదా మనసులో వాటిని ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోండి ఇది నెగిటివ్ విషయాలు మీద దృష్టి పెట్టకుండా మన జీవితంలో ఉన్న పాజిటివ్ అంశాలను గుర్తించేలా చేస్తుంది. ఉదాహరణకు మీరు సురక్షితంగా ఉన్నందుకు ఆరోగ్యంగా ఉన్నందుకు మనసులోనే మీరు దేవుడికి ధన్యవాదాలు చెప్పొచ్చు.
సూర్య రశ్మి లో గడపడం : ఉదయాన్నే సూర్య రశ్మి మన శరీరం పై పడేలా చూసుకోండి. సూర్యరశ్మిలో విటమిన్ డి అందిస్తుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, అలాగే ఇది మన సంతోషాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటాము.
మంచి పుస్తకాలు చదవడం: మన మనసుకి ఉల్లాసాన్ని అందించే పుస్తకాలని చదవడం అలవాటు చేసుకోండి. ఒక మంచి పుస్తకం మన మనసుని ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. అలాంటి పుస్తకాలు లేదా భగవంతుడికి సంబంధించిన పుస్తకాలను చదవడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. నెగిటివ్ ఆలోచనలు దూరమై మనసు పాజిటివ్ ఆలోచనల వైపుకి వెళుతుంది.
ఈ చిన్నపాటి అలవాట్లు మీ ఉదయాన్నే మరింత అందంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఈ పనులను చేయడం వల్ల నెగటివ్ ఆలోచనలు పూర్తిగా దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు నుండే ఈ అలవాట్లను ప్రారంభించి, మీలోని మార్పులను గమనించండి.