తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.

దీంతో ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా…. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ సర్పంచ్ ఎన్నికలకు ఎప్పుడు పెట్టాలని దానిపైన కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలను కనుక నిర్వహించినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయోననే టెన్షన్ లో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆచితూచి ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈరోజు జరిగే సమావేశంలో ఎలాంటి విషయాలను మాట్లాడుతారో క్లారిటీ రానుంది.