ఓ చిన్నారికి నామకరణం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీటీసీ దంపతుల కుమారుడికి ‘సూర్యాంశ్’ అని పేరు పెట్టారు. పార్టీ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని పలువురు విభిన్న రీతుల్లో వ్యక్తం చేస్తుంటారు. సరిగ్గా అలాంటి అపురూపమైన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన లావణ్య, రాంబాబు దంపతులు. తమ కుమారుడికి పేరు పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు తమ బిడ్డను తీసుకువచ్చారు.

కేటీఆర్‌ను కలిసిన దంపతులు తమ సంతోషాన్ని పంచుకుంటూ, తమ కొడుకుకు కేటీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టడం తమ జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన అని వినవించారు. ఈ అపూర్వమైన క్షణం తమకు అత్యంత గౌరవనీయమని వారు తెలిపారు. వారి విజ్ఞప్తికి భావోద్వేగానికి గురైన కేటీఆర్, ఆ చిన్నారి యోగక్షేమాల గురించి ప్రేమగా మాట్లాడారు. బాబుకు ఏ అక్షరంతో పేరు పెట్టాలని కేటీఆర్ అడిగినప్పుడు, తమ కుటుంబ సభ్యులకు ‘సు’ అనే అక్షరంతో పేరు పెట్టాలని బ్రాహ్మణులు సూచించిన విషయాన్ని రాంబాబు, లావణ్య దంపతులు కేటీఆర్‌కు తెలియజేశారు. దీనితో, తన కొడుకు హిమాన్షు పేరును గుర్తు చేసుకుంటూ, ‘సు’ అక్షరంతో ‘సూర్యాంశ్’ అనే పేరును ఆ చిన్నారికి కేటీఆర్ పెట్టారు.