ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. ‘వాహన మిత్ర’ పథకం కింద ప్రతి అర్హుడైన ఆటో డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ సహాయం అక్టోబర్ 1న నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆటో డ్రైవర్లు ఈ నెల 17 నుంచి 19వ తేదీ లోపు తమ గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ సమర్పించాలి. ఈ పథకం వివరాలు చూద్దాం ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆటో, టాక్సీ డ్రైవర్ల ఆర్థిక భారాన్ని తగ్గించి, వారికి తోడుగా నిలబడేందుకు “ఎన్టీఆర్ వాహన మిత్ర” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ యజమాని, డ్రైవర్‌కు వారి వాహనాల మరమ్మత్తులు, బీమా ప్రీమియం నిర్వహణ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తుంది.

పథకానికి ఎవరు అర్హులు: దారిద్ర రేఖకు దిగువన ఉన్న డ్రైవర్లు. ఆటో టాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ యజమాని మరియు డ్రైవర్ గా ఉన్నవారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉన్నవారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇతర అర్హతలను పూర్తి చేసినవారు.
దరఖాస్తు విధానం: ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. ఆన్‌లైన్ ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సాధారణంగా ఆధార్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ పత్రం (RC), డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
పథకం లక్ష్యాలు: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకం ప్రవేశపెట్టింది. అందుకు ముఖ్యం కారణం డ్రైవర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడం.ఇక పేదవారు చిన్న చిన్న ఖర్చుల వల్ల వారు అప్పుల పాలు కాకుండా చూడడం. అంతేకాక డ్రైవర్లు తమ వాహనాలను సక్రమంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించడం. రోడ్డు భద్రత ప్రమాణాలను మెరుగుపరచడం.
ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో ఒక మంచి మార్పు తెస్తుందని, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కూడా ఈ పథకం కింద ఎంతోమంది లబ్ధిపొందారు. ఈ సంవత్సరం కూడా అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.