మహాలయ అమావాస్య హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన దినాలలో ఒకటి. ఈ రోజు పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు సమర్పించడానికి ప్రత్యేకంగా కేటాయించబడింది. సాధారణంగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షం పక్షం రోజులు పితృదేవతలను స్మరించుకుంటాం. అయితే మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణాలు సమర్పించడం ద్వారా విశేషమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక పౌరాణిక కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య రోజు తర్పణాలు సమర్పించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పురాణాల ప్రకారం పితృపక్షంలో పితృదేవతలు యమలోకం నుంచి భూలోకానికి వస్తారు. వారి వారసులు సమర్పించే తర్పణాలను శ్రాద్ధ కర్మలను స్వీకరించడానికి వస్తారు. ఈ పక్షం రోజులు వారు తమ కుటుంబాల చుట్టూ తిరుగుతారని నమ్మకం. ఈ 15 రోజుల్లో ఎప్పుడు తర్పణాలు చేయలేకపోయినా మహాలయ అమావాస్య రోజున సమర్పిస్తే ఆ పక్షంలో చేసిన తర్పణాల ఫలితం లభిస్తుందని చెబుతారు.

మహాలయ అమావాస్యను “సర్వ పితృ అమావాస్య” అని కూడా అంటారు. ఎందుకంటే, ఈ రోజున ఏ పితరుడు అయినా వారి మరణ తిథి తెలియకపోయినా వారి పేరిట తర్పణాలు సమర్పించవచ్చు. ఈ రోజున చేసే తర్పణాలు అన్ని పితృ దేవతలకు చేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. దీనివల్ల పితృ దేవతల ఆశీస్సులు లభించి, కుటుంబంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయి.
మహాలయ అమావాస్య రోజు చేసే తర్పణాలు కేవలం మన పూర్వీకులకు మాత్రమే కాకుండా, మనకు తెలియని పితృ దేవతలకు కనీసం నీరు కూడా దక్కని ఆత్మలకు కూడా శాంతిని కల్పిస్తాయి. ఈ రోజున చేసే దానధర్మాలు, పూజలు కూడా అపారమైన పుణ్యాన్ని అందిస్తాయి.
మహాలయ అమావాస్య రోజు తర్పణాలు సమర్పించడం కేవలం ఒక సంప్రదాయం కాదు అది మన పూర్వీకుల పట్ల మనం చూపించే గౌరవం కృతజ్ఞత. ఈ పవిత్ర దినం మనకు మన పూర్వీకులకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. తర్పణాల ద్వారా వారికి శాంతిని, మనకు వారి ఆశీస్సులను పొందే అవకాశం లభిస్తుంది.