దసరా నవరాత్రులు హిందూ సంస్కృతిలో ఒక పవిత్రమైన పండుగ. ఈ తొమ్మిది రాత్రులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని చీకటిపై వెలుగు గెలిచిన సందర్భాన్ని సూచిస్తుంది. నవరాత్రుల ఉపవాసం పూజలు మన జీవితంలో కొత్త శక్తిని శ్రేయస్సును విజయాన్ని తీసుకొస్తాయి. ప్రతీ ఏటా ఘనంగా జరుపుకునే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కూడా మన ముందుకు రానున్నాయి. మరి ఈసారి దసరా ప్రత్యేకత,పూజావిధానం తెలుసుకుందాం..
దసరా వేడుకలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి ఇందులో 11 రోజుల పాటు పండుగలు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి యేటా అమ్మవారికి 10 ప్రత్యేక అలంకారాలు ఏర్పాటుచేయబడతాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా సెప్టెంబర్ 25న 11వ అవతారం కాత్యాయినీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఇక అక్టోబర్ 2న విజయదశమి (Vijayadashami 2025) పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది తిథి వృద్ధి కారణంగా దసరా శరన్నవరాత్రులు 10 రోజులుగా కొనసాగించనున్నారు. అనంతరం 11వ రోజు సంబరాలు ముగుస్తాయి.
నవరాత్రుల విశిష్టత: నవరాత్రులు ఏడాదికి నాలుగు సార్లు వస్తాయి. అయితే శరదృతువులో వచ్చే దేవీ నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి నవ దుర్గ రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి రూపానికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీబాలాత్రిపురసుందరిదేవి అలంకారం, శ్రీ గాయత్రి దేవి అలకారం, శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం,శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం,శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం,లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం,శ్రీ మహా చండీదేవి అలంకారం,శ్రీసరస్వతి దేవి అలంకారం- శ్రీ దుర్గా దేవి అలంకారం,శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం ఇక చివరిగా దసరా రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం తో అమ్మ దర్శనమివ్వనున్నారు. ఈ పూజల ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది, మన జీవితంలో అష్టైశ్వర్యాలు జ్ఞానం శత్రువుల మీద విజయం పొందుతాం.

పూజ విధానం-ఆశీస్సులు: నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అలంకరణలు చేస్తారు. ఆలయాలలో ఇళ్ళలో అమ్మవారి విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్టించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులు ఉపవాసం ఉండి నిష్టతో పూజలు చేస్తారు. ఈ తొమ్మిది రోజులు దాండియా వంటి సాంప్రదాయ నృత్యాలు ఆడి పండుగ వాతావరణాన్ని ఆనందంగా జరుపుకుంటారు. చివరి రోజు విజయదశమి రోజున రావణ దహనం చేసి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను ముగిస్తారు.
దసరా నవరాత్రులు మన జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని, శక్తిని ప్రసాదిస్తాయి. ఈ తొమ్మిది రోజుల పూజలు ఉపవాసాలు మనకు అంతర్గత ప్రశాంతతను శ్రేయస్సును విజయాన్ని చేకూరుస్తాయి. దసరా నవరాత్రులు కేవలం ఒక పండుగ కాదు ఇది మనలోని చెడును నాశనం చేసి మంచిని నింపే ఒక గొప్ప ప్రయాణం.