మీ పిల్లలకు నిద్రలో గురక వస్తుందా? లేదా తరచుగా గొంతు నొప్పి, చెవిలో నొప్పి వస్తుందా? అయితే అది ఎడినాయిడ్స్ సమస్య కావచ్చు. ఎడినాయిడ్స్ అనేవి మన గొంతు పైభాగంలో ముక్కు వెనుక ఉండే చిన్న గ్రంథులు. అవి మన శరీరానికి రక్షణ కవచం లాంటివి. కానీ అవి పెరిగినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. ఎక్కువగా ఈ సమస్య పిల్లల్లో వస్తుంది. చాలామంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి ఈ సమస్య గురించి తెలుసుకుందాం ..
ఎడినాయిడ్స్ అనేవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం. అవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకుంటాయి. అయితే కొన్నిసార్లు ఇవి ఇన్ఫెక్షన్ వల్ల వాచి పెరిగిపోతాయి. వీటిని వైద్య పరిభాషలో ఎడినాయిడైటిస్ అని అంటారు. ఈ వాపు వల్ల పిల్లలు ముక్కు ద్వారా సరిగ్గా శ్వాస తీసుకోలేరు. దీనివల్ల అనేక ఇతర సమస్యలు మొదలవుతాయి.
నిర్లక్ష్యం చేస్తే కలిగే ప్రమాదాలు: చెవి సమస్యలు కలుగుతాయి. ఎడినాయిడ్స్ వాపు వల్ల చెవిలోని యూస్టాచియన్ ట్యూబ్ మూసుకుపోతుంది. దీనివల్ల మధ్య చెవిలో ద్రవం చేరుకొని చెవిలో ఇన్ఫెక్షన్లు నొప్పి, వినికిడి లోపం వంటి సమస్యలు వస్తాయి.

శ్వాస సమస్యలు: వాపు వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోలేక నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల రాత్రిపూట గురక, నిద్రలేమి, శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు (స్లీప్ ఆప్నియా) వస్తాయి.
ముఖ నిర్మాణం మారడం: దీర్ఘకాలంగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ముఖ నిర్మాణం, దంతాలు దవడల ఆకృతిలో మార్పులు వస్తాయి.
మానసిక సమస్యలు: నిద్రలేమి వల్ల పిల్లలు పగటిపూట నిద్రమత్తుగా చురుకుగా లేనట్లుగా కనిపిస్తారు. ఇది వారి చదువు మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.
తరచుగా ఇన్ఫెక్షన్లు: పెరిగిన ఎడినాయిడ్స్ వల్ల గొంతు నొప్పి, సైనస్ ఇన్ఫెక్షన్లు, తరచుగా జలుబు వంటివి వస్తుంటాయి.
ఎడినాయిడ్స్ సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల పిల్లల శ్వాస సమస్యలు, చెవి ఇన్ఫెక్షన్లు వంటివి నివారించవచ్చు. కొన్ని కేసుల్లో ఆపరేషన్ చేసి ఎడినాయిడ్స్ తొలగిస్తే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
గమనిక: పైన ఇచ్చిన అంశాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మీకు లేదా మీ పిల్లలకు ఈ సమస్య ఉంటే, వెంటనే ENT వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన సలహా, చికిత్స తీసుకోవడం మంచిది.