నిజం-అబద్ధం మధ్య తేడాను గుర్తించడం అనేది మానవ సంబంధాలలో, వ్యాపారంలో రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన నైపుణ్యం. ఎదుటివారు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అని తెలుసుకోవడం అంత సులభం కాదు. కానీ మనస్తత్వ శాస్త్రం ప్రకారం కొన్ని సూచనలను గమనించడం ద్వారా మనం ఈ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఈ సూచనలు వారి మాటల్లోనే కాకుండా వారి శరీర భాష ప్రవర్తనలో కూడా ఉంటాయి. మరి ఆసక్తికరమైన సైకాలజీ చిట్కాలను తెలుసుకుందాం..
శరీర కదలికలు: అబద్ధం చెప్పేటప్పుడు, చాలామంది ప్రజలు అసాధారణమైన శరీర కదలికలు చేస్తారు. ఉదాహరణకు చేతులను వెనక్కి పెట్టి మాట్లాడటం, ముఖాన్ని పదే పదే తాకడం, నోటిని చేతితో కప్పుకోవడం లేదా అనవసరమైన హావభావాలు ప్రదర్శించడం. కళ్ళను ఎక్కువగా రుద్దుకోవడం ముక్కును తడుముకోవడం లేదా జుట్టును సరిచేసుకోవడం లాంటివి కూడా అబద్ధానికి సంకేతాలు కావచ్చు.
కళ్ళను తప్పించడం: అబద్ధం చెప్పేటప్పుడు నేరుగా కళ్ళలోకి చూడటం చాలా కష్టం. ఒకవేళ చూసినా కొన్ని క్షణాల తర్వాత కళ్ళను తప్పిస్తారు. అయితే కొంతమంది కావాలనే ఎక్కువసేపు కళ్ళలోకి చూసి తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు.

మాటల్లో మార్పులు: అబద్ధం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి మాటల్లోని శబ్దం, వేగం మారవచ్చు. కొంతమంది చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా మాట్లాడితే, మరికొందరు చాలా వేగంగా మాట్లాడుతారు. కొన్ని పదాలను పదే పదే వాడటం లేదా వాక్యాన్ని మధ్యలో ఆపడం వంటివి కూడా గమనించవచ్చు.
వివరాలు ఇవ్వకపోవడం: అబద్ధం చెప్పేటప్పుడు, చాలామంది సాధారణంగా చాలా తక్కువ వివరాలను ఇస్తారు. ఒకవేళ మీరు వారిని అదనపు వివరాలు అడిగితే, వారు గందరగోళానికి గురై, సమాధానాలు దాటవేయడానికి ప్రయత్నిస్తారు.
సంశయం: అబద్ధం చెప్పే వ్యక్తి సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇది వారి మాటలను కథను అప్పటికప్పుడు అల్లుకోవడానికి ప్రయత్నించడాన్ని సూచిస్తుంది. నిజం చెప్పేవారు సాధారణంగా సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోరు.
ఈ చిట్కాలు కేవలం అంచనాలు మాత్రమే. ఎందుకంటే ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు వారి ప్రవర్తనలో అనేక మార్పులు రావచ్చు. కానీ ఈ సూచనలను జాగ్రత్తగా గమనించడం ద్వారా, మనం ఒక వ్యక్తి నిజాయితీని అంచనా వేయడంలో మరింత నైపుణ్యం సాధించవచ్చు. మీ అవగాహన, అంతర్బుద్ధిని ఉపయోగించి ఈ లక్షణాలను పరిశీలిస్తే, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ చిట్కాలు కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ లక్షణాలు ఒక వ్యక్తి ఆందోళన లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా కనిపించవచ్చు.