కలియుగ వైకుంఠం తిరుమలలో నిత్యం జరిగే ఉత్సవాల వైభవం అంతా ఇంతా కాదు. అందులో భక్తులందరినీ ఆకట్టుకునే అపురూప ఘట్టం ‘భాగ్ సవారీ’ ఉత్సవం. వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే జరిగే ఈ ఉత్సవం వెనుక ఒక అద్భుతమైన భక్తుని కథ, శ్రీవారిపై ఆయనకున్న తిరుగులేని భక్తికి సాక్ష్యం ఉంది. ఆ భక్త శిఖామణి ఎవరు? ఆ కథేంటి? ఈ సవారీ విశిష్టత ఏంటి? తెలుసుకుందాం.
భాగ్ సవారీ, విశిష్టత: భాగ్ సవారీ ఉత్సవం ముఖ్యంగా శ్రీవారి భక్తావతంసుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని స్మరించుకుంటూ నిర్వహించే పండుగ. పురుశైవారి తోట అని పిలవబడే అనంతాళ్వారుల పూదోటతో ఈ ఉత్సవానికి అవినాభావ సంబంధం ఉంది.
పురాణ కథ: పూర్వం, అనంతాళ్వారులు స్వామివారి కైంకర్యం కోసం తిరుమలలో పూదోట పెంచుతూ, ప్రతిరోజూ పూలను స్వామివారికి సమర్పించేవారు. ఒకరోజు, స్వామివారు తన భక్తుని భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి అమ్మవారితో కలిసి మానవ రూపంలో ఆ తోటలోకి వస్తారు. అమ్మవారు ఆ తోటలో పూలు కోస్తుండగా అది చూసిన అనంతాళ్వారులు, ఆమె దొంగలించడానికి వచ్చిందని భావించి, ఆగ్రహంతో ఆమెను తోటలోని పొగడమాను చెట్టుకు బంధిస్తారు.
అయితే అమ్మవారిని బంధించిన విషయం తెలుసుకున్న స్వామివారు అక్కడి నుంచి అప్రదక్షిణంగా పరుగెత్తి ఆలయంలోనికి ప్రవేశించి మాయమైపోతారు. వెంటనే అనంతాళ్వారులు అది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లీలేనని, తన భక్తిని పరీక్షించడానికే వచ్చారని గ్రహించి పశ్చాత్తాపపడతారు. అమ్మవారిని బంధవిముక్తురాలిని చేసి, ఆమెను పూలబుట్టలో కూర్చోబెట్టి, గౌరవంగా శ్రీవారి చెంతకు చేర్చారట.

ఉత్సవ విశిష్టత: అనంతాళ్వారుల భక్తికి ముగ్ధుడైన శ్రీవారు, ఆయన కోరిక మేరకు, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు తాను ఆయన తోటలోకి అప్రదక్షిణంగా విచ్చేసి, పూజలు అందుకుని తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారు.
ఆ అభయాన్ని అనుసరించే ఈ ‘భాగ్ సవారీ’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు శ్రీమలయప్ప స్వామివారు (ఉత్సవమూర్తి) అప్రదక్షిణంగా అనంతాళ్వారుల తోటకు ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ పొగడమానుకు ప్రత్యేక పూజలు, నివేదనలు జరిపి, స్వామివారికి అలంకరించిన పూలమాలలను సమర్పించి, తిరిగి ఆలయంలోకి వస్తారు. ఈ ఉత్సవం గురు శిష్య బంధానికి, అలాగే భక్తుడు-భగవంతుడు మధ్య గల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది.
భాగ్ సవారీ ఉత్సవం కేవలం శ్రీవారి దర్శనం మాత్రమే కాదు, శ్రీ అనంతాళ్వారుల భక్తి గొప్పతనాన్ని కీర్తించే ఒక పవిత్ర సంప్రదాయం. ఈ ఉత్సవం ద్వారా స్వామివారు తన భక్తులకు సమర్పణ భావం నిస్వార్థ భక్తి యొక్క ప్రాధాన్యతను చాటి చెబుతారు. అనంతాళ్వారుల భక్తిని స్మరించుకుంటూ ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి.