అమెజాన్ డ్రోన్ డెలివరీలు, ఫాస్ట్ కొరియర్ సర్వీసులు పాతబడిపోయాయి. ఎందుకంటే భవిష్యత్తులో మీ అత్యవసర వస్తువులు నేరుగా అంతరిక్షం (Space) నుండి రాబోతున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఇన్వర్షన్ స్పేస్, అనే స్టార్టప్ సంస్థ ఈ కలను నిజం చేస్తూ ‘ఆర్క్’ (Arc) అనే వినూత్న అంతరిక్ష వాహనాన్ని ఆవిష్కరించింది. భూమిపై ఎక్కడికైనా కేవలం ఒక గంటలోపు అత్యంత ముఖ్యమైన సరుకును డెలివరీ చేసే ఈ టెక్నాలజీ, లాజిస్టిక్స్ ప్రపంచంలోనే ఒక సంచలనం. ఈ విప్లవాత్మక ‘ఆర్క్’ పనితీరు దాని లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం.
‘ఆర్క్’ అంటే ఏమిటి? పనితీరు రహస్యం: ‘ఆర్క్’ (Arc) అనేది అటానమస్ (స్వయంచాలిత), తిరిగి వాడుకోగలిగే మరియు తక్కువ ఖర్చుతో కూడిన అంతరిక్ష ఆధారిత డెలివరీ వాహనం, ఇది ఒక సాధారణ ఉపగ్రహం లేదా స్పేస్ క్యాప్సూల్ కాదు, రెండింటి కలయికతో తయారుచేసిన ‘లిఫ్టింగ్ బాడీ రీఎంట్రీ వెహికల్’ రకానికి చెందింది. ఈ వాహనాలను భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలో, ముందుగానే సిద్ధంగా ఉంచుతారు.
డెలివరీ ప్రక్రియ: ఆర్క్ సుమారు 225 కిలోల (500 పౌండ్లు) సరుకును ఐదు సంవత్సరాల వరకు అంతరిక్షంలో నిల్వ చేయగలుగుతుంది. అత్యవసర డెలివరీ ఆర్డర్ రాగానే ఆర్క్ వాహనం కక్ష్య నుండి బయటకు వచ్చి, డీ-ఆర్బిట్ ఇంజిన్ సాయంతో భూ వాతావరణంలోకి హైపర్సోనిక్ వేగంతో కంటే ఎక్కువ దూసుకు వస్తుంది. ఇందులోని అధునాతన AI, నావిగేషన్ సిస్టమ్స్ మరియు నియంత్రణ ఫ్లాప్‌ల సహాయంతో ఇది భూమిపై ఎక్కడైనా లక్ష్యానికి కేవలం 50 అడుగుల దూరంలో ఖచ్చితంగా దిగగలుగుతుంది. పారాచూట్ల సాయంతో ఈ ల్యాండింగ్ సురక్షితంగా జరుగుతుంది.

అంతరిక్షం లాజిస్టిక్స్ హబ్: దీని ప్రధాన లక్ష్యం, ఇన్వర్షన్ స్పేస్ సంస్థ యొక్క ప్రధాన దృష్టి కేవలం సాధారణ డెలివరీలపై కాకుండా, అత్యవసర మరియు మిషన్-క్రిటికల్ కార్గో పంపిణీపై ఉంది. ఆర్క్ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం, మౌలిక సదుపాయాలు లేని లేదా అత్యంత రిమోట్ ప్రదేశాలకు యుద్ధభూమికి అవసరమైన వైద్య సామాగ్రి, పరికరాలు చిన్న నిఘా డ్రోన్లు వంటి వాటిని శత్రువులు చేరుకోలేని ప్రాంతాలకు కూడా ఒక గంటలోపు అందించడం.
ఈ సామర్థ్యం జాతీయ భద్రత, రక్షణ రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అంతరిక్షాన్ని కేవలం పరిశోధనా కేంద్రంగా కాకుండా అత్యంత వేగవంతమైన గ్లోబల్ లాజిస్టిక్స్ డొమైన్‌గా మార్చాలనేదే ఇన్వర్షన్ స్పేస్ యొక్క దూరదృష్టి. 2028 నాటికి వందల సంఖ్యలో ఆర్క్ వాహనాలతో పూర్తిస్థాయి డెలివరీ నెట్‌వర్క్‌ను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇన్వర్షన్ స్పేస్ సంస్థ ఆవిష్కరించిన ‘ఆర్క్’ అనేది భవిష్యత్తు యొక్క రవాణా మరియు లాజిస్టిక్స్ రంగానికి ఒక దిక్సూచి. అంతరిక్షం నుండి కేవలం 60 నిమిషాల్లో డెలివరీ చేయగల ఈ సాంకేతికత, అత్యవసర సమయాల్లో మానవ జీవితాలను రక్షించడంలో, రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ చారిత్రక పరిణామం ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో చూసిన అద్భుతాలు ఇప్పుడు నిజమవుతున్నాయని నిరూపిస్తోంది.