ప్రతి స్త్రీ జీవితంలో గర్భధారణ అనేది అత్యంత సున్నితమైన కీలకమైన సమయం. ఈ సమయంలో సరైన పోషణ, విశ్రాంతి లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదం. అందుకే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి గర్భిణీ స్త్రీలు సరైన సంరక్షణ పొందేందుకు భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థిక సహాయం పొందడమే కాకుండా మెరుగైన ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారు. ఈ పథకం ఎవరికి అనుకూలం? ఎలాంటి లాభాలు అందిస్తుంది? తెలుసుకుందాం.
పీఎంఎంవీవై ద్వారా ఆర్థిక లాభాలు, లక్ష్యాలు: పీఎంఎంవీవై (PMMVY) పథకం కింద, అర్హులైన గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నగదు ప్రోత్సాహకం అందుతుంది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు, వేతన నష్టానికి పాక్షిక పరిహారం అందించడం తద్వారా తల్లి బిడ్డ పుట్టడానికి ముందు, తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అలవాటు చేసుకోవడాన్ని ప్రోత్సహించడం.
మొదటి బిడ్డకు: ఈ పథకం కింద మొదటి బిడ్డకు మొత్తం ₹ 5,000 ఆర్థిక సహాయం రెండు లేదా మూడు విడతల్లో అందుతుంది. ఇది సాధారణంగా మొదటి విడత గర్భం నమోదు చేసుకున్నప్పుడు, కనీసం ఒక ప్రసవ-పూర్వ తనిఖీ చేయించుకున్న తర్వాత అందుతుంది.

రెండవ విడత: బిడ్డ జన్మ నమోదు అయిన తర్వాత, బిడ్డకు 14 వారాల వరకు టీకాలు పూర్తయిన తర్వాత. అంతేకాక సంస్థాగత ప్రసవం జరిగితే, జేఎస్‌వై (JSY) కింద అదనంగా నగదు లభిస్తుంది, దీనితో మొత్తం సుమారు ₹ 6,000 వరకు పొందవచ్చు.
ఈ పథకం ఎవరికి అనుకూలం (అర్హతలు): PMMVY పథకం ప్రధానంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు, రోజువారీ కూలీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హతలు (PMMVY 2.0 ప్రకారం) గర్భిణీ స్త్రీలు, బాలింతలు అర్హులు. మొదటి బిడ్డకు లబ్ధి పొందవచ్చు. రెండవ సంతానం ఆడపిల్ల అయితే వారికి ₹ 6,000 ఒకే విడతలో లభిస్తుంది. లింగ నిష్పత్తిని పెంచడానికి ఆడపిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించడానికి ఈ నిబంధన చేర్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) ఉద్యోగులు కాని మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
అర్హత ఉన్న మహిళలు: ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డుదారులు, కిసాన్ సమ్మాన్ నిధి (Kisan Samman Nidhi) లబ్ధిదారులు, ఈ-శ్రమ్ కార్డుదారులు, రూ. 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న మహిళలు వంటి వారు ఈ పథకానికి అర్హులు.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అనేది గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఆర్థిక భద్రతను అందించడమే కాక, తల్లి, శిశు మరణాల రేటును తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ నగదు సహాయం ద్వారా మహిళలు తమ ఆరోగ్యంపై బిడ్డ టీకాలపై దృష్టి సారించడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి అర్హత కలిగిన తల్లి ఈ పథకంలో నమోదు చేసుకోవడం ద్వారా తమకు తమ బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించవచ్చు.
గమనిక: లబ్ధిదారులు తమ గర్భధారణను అంగన్‌వాడీ కేంద్రం (AWC) లేదా ఆమోదించబడిన ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ముందుగా నమోదు చేసుకోవాలి మరియు ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి. వివరాల కోసం సమీపంలోని అంగన్‌వాడీ కార్యకర్తను సంప్రదించండి.