ప్రేమలో పడటం, బంధాన్ని కొనసాగించడం ఒక ఎత్తైతే, ఆ బంధం మధ్యలో ఊహించని సమస్యలు రావడం మరొక ఎత్తు. బ్రేకప్ (Breakup) అంటే కేవలం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు, అపార్థాలే కారణం అనుకుంటాం. కానీ మీరు నివసించే ఇంటి వాతావరణం ఇంట్లోని అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు కూడా మీ బంధాన్ని ముక్కలు చేయగలవని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ఇంటి వాతావరణం కూడ బ్రేకప్‌కి కారణమా? ఆశ్చర్యపరిచే ఈ నిజాలు మనము తెలుసుకుందాం..
ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్న జంటలు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఒత్తిడికి గురై విడిపోవడానికి సిద్ధమవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంటి వాతావరణం బ్రేకప్‌కు కారణమయ్యే కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకోవటం ముఖ్యం.
నిరంతర ఒత్తిడి : ఇంట్లో అధికంగా వస్తువులు పేరుకుపోవడం, అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మెదడు ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంది. ప్రశాంతమైన వాతావరణం లేకపోతే, భాగస్వాములిద్దరూ ఇంటికి రాగానే రిలాక్స్ కాలేరు. ఈ నిరంతర ఒత్తిడి చిన్న చిన్న విషయాలకు కూడా కోపం, చిరాకుగా మారి తరచుగా గొడవలకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన సంభాషణ లేకపోవడం: ఒక మురికి లేదా అపరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి మనసు అంగీకరించదు. ఇల్లు శుభ్రంగా, ప్రశాంతంగా లేకపోతే భాగస్వాములు ఒకరితో ఒకరు సున్నితమైన విషయాలు మాట్లాడటానికి లేదా ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా వెనుకాడతారు. ఇది భావ వ్యక్తీకరణ లోపాన్ని సృష్టించి, దూరాన్ని పెంచుతుంది.
పనుల భారం, నిందలు: ఇంట్లోని వస్తువులను సర్దడం, శుభ్రం చేయడం అనేది ఒకరి బాధ్యతగా కాకుండా,కేవలం ఒకరిపైనే భారం పడినప్పుడు నిందలు, ఫిర్యాదులు మొదలవుతాయి. “నువ్వేం చేయట్లేదు” “ఇంటిని శుభ్రంగా ఉంచే బాధ్యత నీదే” వంటి మాటలు తరచుగా వినిపిస్తాయి. ఈ నిందారోపణలు భాగస్వాముల మధ్య అసహనం పెంచి, విభేదాలను తీవ్రం చేస్తాయి.
అహం దెబ్బతినడం: అస్తవ్యస్తంగా ఉన్న ఇంట్లో జీవించడం వల్ల ఆత్మగౌరవం తగ్గుతుంది. ఇల్లు పనుల కారణంగా సామాజిక జీవితం కూడా దెబ్బతింటుంది. స్నేహితులను ఇంటికి పిలవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ ఒంటరితనం ఇబ్బంది బంధంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
సురక్షితమైన, ప్రశాంతమైన స్థలం అనేది ఒక బంధానికి మూలాధారం లాంటిది. మీ ఇంటిని శుభ్రంగా వ్యవస్థీకృతంగా ఉంచడం కేవలం పరిశుభ్రత కోసం మాత్రమే కాదు; అది మీ బంధాన్ని బలంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ బంధం సంతోషంగా ఉండాలంటే, మీ ఇంటి వాతావరణం పట్ల కూడా శ్రద్ధ వహించండి.
గమనిక: మీ ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు, మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటిని కలిసి శుభ్రం చేసుకోవడం అనేది జంటలు కలిసి పనిచేయడాన్ని, ఒకరినొకరు గౌరవించుకోవడాన్ని పెంచుతుంది.