తలుచుకుంటేనే భయపెట్టే ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. అయితే ప్రతి చిన్న తలనొప్పి లేదా మూడ్ స్వింగ్స్ దీనికి సంకేతాలు కాకపోవచ్చు. కానీ కొన్ని లక్షణాలు సాధారణ అనారోగ్యాలుగా అనిపించినా వాటి వెనుక మెదడుకు సంబంధించిన తీవ్రమైన సమస్య దాగి ఉండొచ్చు. ముఖ్యంగా మీరు తరచుగా అనుభవించే తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన మూడ్ మార్పులు వంటివి నిజంగా బ్రెయిన్ ట్యూమర్‌కు ముందస్తు హెచ్చరికలు అవుతాయా? ఈ ప్రమాదకర సంకేతాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
మన శరీరంలోని ముఖ్యమైన అంగం మెదడు. అందులో చిన్న సమస్య వచ్చినా అది మన శరీరం, మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి) అనేది మెదడులోని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడుతుంది. ఇది పెరిగే కొద్దీ మెదడుపై ఒత్తిడి పెరిగి వివిధ లక్షణాలు కనిపిస్తాయి.
సాధారణ లక్షణాలు: తలనొప్పి, వాంతులు, ఇది సాధారణ తలనొప్పి కంటే భిన్నంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే లేదా దగ్గినప్పుడు, వంగినప్పుడు నొప్పి మరింత పెరుగుతుంది. సాధారణ నొప్పి నివారణ మందులతో కూడా తగ్గదు.
వికారం, వాంతులు: ముఖ్యంగా తలనొప్పితో పాటు, ఉదయం పూట ఎటువంటి కారణం లేకుండా వాంతులు (Nausea and Vomiting) కావడం ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు.

మానసిక, ప్రవర్తన సంబంధిత లక్షణాలు: ట్యూమర్ మెదడులోని ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే భాగంలో ఉంటే, ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి మూడ్ స్వింగ్స్. విపరీతమైన కోపం, చిరాకు లేదా నిరాశ లాంటి మానసిక మార్పులు, తరచుగా భావోద్వేగాలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. జ్ఞాపకశక్తి లోపం, ఇటీవల జరిగిన విషయాలను కూడా గుర్తుంచుకోలేకపోవడం, గందరగోళం మరియు ఏకాగ్రత లోపించడం.
శారీరక, నరాల సంబంధిత లక్షణాలు: మూర్ఛలు ఇది బ్రెయిన్ ట్యూమర్‌ను సూచించే ముఖ్యమైన హెచ్చరిక. ఇది చిన్నపాటి కదలికల నుండి తీవ్రమైన ఫిట్స్ వరకు ఉండవచ్చు. చూపు, వినికిడి సమస్యలు, కంటి చూపు అకస్మాత్తుగా తగ్గడం, దృష్టి కోల్పోవడం, లేదా ఒక చెవిలో వినికిడి తగ్గడం జరుగుతుంది. ఇక శరీర బలహీనత, ఒకవైపు చేయి లేదా కాలు బలహీనపడటం, నడవడంలో ఇబ్బంది లేదా బ్యాలెన్స్ కోల్పోవడం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పై లక్షణాలు అన్నీ బ్రెయిన్ ట్యూమర్‌కు సంబంధించినవే కానప్పటికీ ఈ లక్షణాలు కొత్తగా, తరచుగా తీవ్రంగా కనిపిస్తూ, సాధారణ చికిత్సతో కూడా తగ్గకపోతే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం అత్యంత అవసరం. ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభమవుతుంది.
గమనిక: మీకు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా తలనొప్పి ఉంటూ, దానితో పాటు వ్యక్తిత్వంలో మార్పులు, మూర్ఛలు లేదా స్పష్టమైన వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి.