పవిత్రమైన కార్తీక మాసం మొదలైందంటే చాలు ప్రతి ఇంటా ఆధ్యాత్మిక వాతావరణం, నియమ నిష్టలు వెల్లివిరుస్తాయి. ఈ దీక్షలో ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి తినకూడదనే నియమం అందరికీ తెలిసిందే. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన వారు లేదా కఠిన దీక్ష పాటించేవారు కేవలం వీటినే కాదు కొన్ని రకాల ఇతర ఆహారాలను కూడా దూరంగా పెట్టాలి. ఈ నియమాలు కేవలం ఆచారం కోసం కాదు, మనసును శరీరాన్ని దైవ చింతన వైపు మళ్లించే ఒక చక్కటి ప్రయత్నం. మరి అవేంటో తెలుసుకుందాం.
కార్తీక దీక్షలో కేవలం ఉల్లి, వెల్లుల్లిని పక్కన పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం, అవి తామస గుణాన్ని పెంచే ఆహార పదార్థాలు కావడమే. తామస గుణం మనిషిలో నిద్ర, బద్ధకం, ఆందోళన వంటి భావాలను పెంచి, దైవ చింతనపై ఏకాగ్రతను చెదరగొడుతుంది. అయితే ఉల్లి, వెల్లుల్లితో పాటు, దీక్షలో కఠినంగా ఉండే వారు మరికొన్నింటిని కూడా వదిలిపెట్టడం మంచిది.

మసాలాలు : తీవ్రమైన కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు రాజస గుణాన్ని పెంచుతాయి. ఇవి మనస్సును చంచలంగా, అతి చురుకుగా చేసి, ప్రశాంతతను తగ్గిస్తాయి. అందుకే, ఈ మాసంలో సాత్విక ఆహారం (తక్కువ నూనె, తక్కువ మసాలాలు) తీసుకోవాలి.
మాంసాహారం: ఇది కూడా తామస గుణానికి ప్రతీకగా భావిస్తారు. దీక్ష కాలంలో పూర్తిగా శాకాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికపడి, మనసు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది.
ఉలవలు, కందిపప్పు: సాధారణంగా వ్రతాలు దీక్షల్లో ఉలవలు, కందిపప్పు వంటివి కూడా నిషేధంగా భావిస్తారు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయని, జీర్ణవ్యవస్థపై భారాన్ని మోపుతాయని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో పెసరపప్పు, ఆకుకూరలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
పాత అన్నం/నిల్వ ఆహారం: త్వరగా పాడయ్యే, నిల్వ ఉంచిన పదార్థాలు పులిసినవి తామస గుణాన్ని పెంచుతాయి. అందుకే తాజాగా, అప్పటికప్పుడు వండిన సాత్విక భోజనం మాత్రమే చేయాలి.
ఈ నియమాలన్నీ కేవలం కట్టుబాట్లుగా చూడకూడదు. కార్తీక మాసం అనేది శీతాకాలం మొదలయ్యే సంధికాలం. ఈ సమయంలో జీర్ణశక్తి కొద్దిగా మందగిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు మరియు మాంసాహారాన్ని తగ్గించడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా తేటగా మారుతుంది.
ఈ దీక్షలో మనం తీసుకునే ప్రతీ నియమం.. భక్తితో పాటు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తుంది. శివకేశవుల అనుగ్రహం కోసం చేసే ఈ దీక్షలో, కేవలం బయటి శుద్ధి (స్నానం, దీపారాధన) మాత్రమే కాదు లోపలి శుద్ధి (సాత్విక ఆహారం) కూడా ముఖ్యమే. ఆహార నియమాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని నిత్యం దైవ నామాన్ని స్మరించడమే ఈ మాసం యొక్క అసలు పరమార్థం. కార్తీక దీక్షలో ఆహార నియమాలు కేవలం నిరాహార దీక్ష కోసం కాదు, అవి మనసును, శరీరాన్ని పవిత్రం చేసి, ఆధ్యాత్మిక ఉన్నతిని పెంచే దివ్యౌషధాలు.
గమనిక: ఈ నియమాలు ప్రాంతాల వారీగా వ్యక్తిగత దీక్షా స్థాయిని బట్టి మారవచ్చు. దీక్ష పాటించేవారు తమ ఆరోగ్యం మరియు గురువుల సలహాల మేరకు ఆహార నియమాలను పాటించడం శ్రేయస్కరం.