తల్లిదండ్రులందరికీ తమ పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఆరాటం ఉంటుంది. ఎదుగుతున్న చిన్నారులకు ప్రోటీన్లు, ఐరన్ చాలా ముఖ్యం. మరి ఈ పోషకాల కోసం వారి ఆహారంలో మాంసాహారం (Non-veg) జోడించడం అవసరమా? ఎప్పుడు మొదలుపెట్టాలి? గుడ్డుతోనా లేక చేపలతోనా? పిల్లల ఆరోగ్యానికి సరైన పోషకాలను అందించడానికి మరియు వారి ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం..
నాన్‌వెజ్‌తో లభించే పోషకాలు: సాధారణంగా శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అత్యుత్తమ ఆహారం. ఆ తర్వాత ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, మాంసాహారాన్ని కూడా పరిచయం చేయవచ్చు. ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య నుంచే నాన్‌వెజ్‌ను పెట్టడం ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నెలల తర్వాత శిశువులలో ఐరన్ నిల్వలు తగ్గడం మొదలవుతాయి కాబట్టి ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే మాంసాహారం వారి ఎదుగుదలకు చాలా మంచిది. గుడ్డు, చికెన్, చేపల్లో ఉండే అధిక ప్రోటీన్లు మరియు విటమిన్ బి12 పిల్లల మెదడు, నాడీ కణాల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. మాంసాహారాన్ని కొద్ది మొత్తంలో ఇవ్వడం ద్వారా వారి కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండి ఇతర ఆహారాల నుండి ఐరన్ శోషణ కూడా పెరుగుతుంది.

ఎలా మొదలుపెట్టాలి?: పిల్లల ఆహారంలో నాన్‌వెజ్‌ను పరిచయం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మొదటగా గుడ్డు పచ్చసొన తో ప్రారంభించడం మంచిది. చికెన్ లేదా చేపలను సూప్ రూపంలో లేదా మెత్తగా ఉడికించిన ప్యూరీ లాగా మాత్రమే ఇవ్వాలి. మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా, బాగా నలిపి లేదా పేస్ట్‌లా చేసి ఇవ్వడం వలన ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు లేని మాంసాన్ని మాత్రమే ఉపయోగించాలి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే మటన్ వంటి ఎరుపు మాంసాన్ని రెండు సంవత్సరాల తర్వాతే ఇవ్వడం ఉత్తమం. ఎప్పుడూ తాజా మాంసాన్నే ఉపయోగించాలి మరియు వండే ముందు శుభ్రంగా కడగాలి. ఏదైనా కొత్త ఆహారం ఇచ్చినప్పుడు వారికి జీర్ణ సమస్యలు వస్తున్నాయేమో రెండు మూడు రోజులు గమనించడం ముఖ్యం.
చిన్న పిల్లల ఎదుగుదలకు మాంసాహారం ఒక మంచి పోషక వనరు. సరైన సమయంలో, సరైన విధంగా నిపుణుల సలహా మేరకు వారి ఆహారంలో నాన్‌వెజ్‌ను జోడించడం వలన వారికి అవసరమైన ప్రోటీన్లు ఐరన్ మరియు విటమిన్లు అందుతాయి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఏ ఆహారం సరిపోతుందో, ఎంత మోతాదులో ఇవ్వాలో తెలుసుకోవడానికి శిశువైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
గమనిక: పిల్లల ఆహారంలో ఏదైనా కొత్త ఆహార పదార్థాన్ని ప్రవేశపెట్టే ముందు ముఖ్యంగా నాన్‌వెజ్‌ను జోడించే ముందు, దయచేసి మీ శిశువైద్యుడిని సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు మాత్రమే అనుసరించగలరు.
