ఆవు పాలు, గేదె పాలు ఏ పాలైనా ఒక చెంచా తోడు వేస్తే మరుసటి రోజు ఉదయం చక్కటి పెరుగుగా మారుతుంది. ఇది మనందరికీ తెలిసినదే. కానీ ప్రపంచంలో ఒక జంతువు పాలు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా సులభంగా పెరుగుగా మారవు. పోషకాల గని అయిన ఆ పాలు ఏవి? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సైన్స్ ఏంటో తెలుసుకుందాం.
ఆ విచిత్రమైన పాలు ఒంటెవి: నిజానికి ఆ ప్రత్యేకమైన జంతువు ఒంటె. ఎడారి ఓడగా పిలువబడే ఒంటె పాలు. ఆవు, గేదె పాల మాదిరిగా అంత సులభంగా తోడు పెట్టడానికి పెరుగు చేయడానికి వీలుకాదు. ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, సాధారణంగా పాలు పెరుగుగా మారడానికి వాటిలో ఉండే కేసిన్ అనే ప్రొటీన్ అవసరం. ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో కేసిన్ ప్రొటీన్ యొక్క రసాయన నిర్మాణం భిన్నంగా ఉంటుంది.

పెరుగు ఎందుకు కాదు? శాస్త్రీయ కారణం ఇదే: ఒంటె పాలలో ఉండే కేసిన్ యొక్క అణువులు చాలా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. అందువల్ల ఇవి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లేదా ఇతర ఎంజైమ్లతో చర్య జరిపినా, సులభంగా గడ్డకట్టవు. అంతేకాక ఈ పాలలో సహజంగానే యాంటీ-మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి పెరుగు తయారు కావడానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధిని ఆలస్యం చేస్తాయి లేదా అడ్డుకుంటాయి. ఫలితంగా, ఒంటె పాలను పెరుగుగా మార్చడం చాలా కష్టం. అయితే ప్రత్యేకమైన పద్ధతులు రసాయనాలను ఉపయోగించి ఇప్పుడు ఒంటె పాల నుంచి కూడా పెరుగు, జున్ను వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
ఒంటె పాలు కేవలం పెరుగుగా మారలేవనే ప్రత్యేకతతో ఆగిపోలేదు. ఇవి ఇన్సులిన్ విటమిన్ ‘C’ మరియు రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్లతో నిండి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారిగా భావిస్తారు. ప్రకృతిలో ప్రతీ జంతువు దాని జీవనశైలికి తగినట్టుగా తన పాలను ప్రత్యేకంగా మార్చుకుంటుందనడానికి ఒంటె పాలు ఒక చక్కటి ఉదాహరణ. పాలు, పెరుగు యొక్క రుచిని మించిన పోషక విలువ ఒంటె పాల సొంతం.
