దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి మనం రోజూ వాడే మస్కిటో కాయిల్స్, లిక్విడ్ రిపెల్లెంట్లు మన ఆరోగ్యాన్ని ఎంతగా పాడుచేస్తున్నాయో తెలుసా? ఆ కృత్రిమ రసాయనాల కంటే, మన ఇంట్లోనే పెంచుకునే కొన్ని అద్భుతమైన హెర్బల్ మొక్కలు దోమలను శాశ్వతంగా తరిమికొట్టగలవు. వాటిని పెంచితే ఇల్లు అందంగా, ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అవేంటో వాటి రహస్యమేంటో తెలుసుకుందాం..
రసాయన రిపెల్లెంట్లతో ఆరోగ్యంపై ముప్పు: దోమల నివారణ కోసం మార్కెట్‌లో లభించే కృత్రిమ మిషన్లు, కాయిల్స్ మనకు తక్షణ ఉపశమనం ఇస్తున్నట్లు అనిపించినా, అవి దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తాయి. వాటి నుంచి విడుదలయ్యే అలెథ్రిన్, ఏరోసోల్ వంటి రసాయన మిశ్రమాలు మన శ్వాసకోశ వ్యవస్థలోకి చేరి, శ్వాస సంబంధిత సమస్యలకు, అలర్జీలకు కారణమవుతాయి. ఈ రసాయన పొగలు చిన్న పిల్లలకు, వృద్ధులకు మరింత ప్రమాదకరం. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ కృత్రిమ పద్ధతులను వదిలి, ప్రకృతి ఇచ్చిన సహజ పరిష్కారాల వైపు చూడాల్సిన అవగాహన ఇప్పుడు అవసరం.
సహజసిద్ధమైన రక్షణ కవచం: హెర్బల్ మొక్కలు,దోమలను తరిమికొట్టడంలో కొన్ని హెర్బల్ మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటి నుంచి వచ్చే సహజ సువాసన దోమలకు అసలు పడదు, అందుకే అవి ఆ పరిసరాలకు దూరంగా ఉంటాయి.

బంతి (Marigold): బంతి పూల మొక్కల్లోని ప్రత్యేక సువాసన దోమలనే కాదు, ఇతర కీటకాలను కూడా దరిచేరనీయదు. ఇంట్లో ప్రవేశ ప్రాంతంలో వీటిని పెంచుకుంటే చాలా మంచిది.
తులసి (Basil): ఆధ్యాత్మికంగానే కాక, ఆరోగ్యానికీ సంజీవని అయిన తులసి మొక్క నుంచి వచ్చే ఓలియోరెజిన్స్ అనే రసాయనం దోమలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
లావెండర్ (Lavender): మనుషులకు ఆహ్లాదకరంగా ఉండే లావెండర్ సువాసన దోమలకు ఇష్టం ఉండదు. ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే సరిపోతుంది.
కలబంద (Aloe Vera): కలబంద ప్రత్యక్షంగా దోమలను తరిమికొట్టకపోయినా, దీనిని ఇతర మొక్కలతో కలిపి పెంచడం, లేదా దాని రసాన్ని చర్మానికి పూయడం వలన చర్మానికి రక్షణ, ఉపశమనం లభిస్తుంది.
మీ ఇంటి ఆవరణలో ఈ సహజమైన హెర్బల్ మొక్కలను పెంచుకోవడం వల్ల ఇల్లు అందంగా మారడమే కాదు దోమల బెడద నుంచి విముక్తి లభిస్తుంది. కృత్రిమ రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇది ఎంతో సులభమైన, సురక్షితమైన మార్గం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీ ఇంటిని దోమ రహితంగా ఉంచుకోవడానికి ప్రకృతిని మించిన పరిష్కారం మరొకటి లేదు.
