ప్రొటీన్‌కు (Protein) పర్యాయపదం ఏది అంటే అది గుడ్డు అంటాము పోషకాల గని అయిన గుడ్డు (Egg) గురించి చాలా సంవత్సరాలుగా ఒక అపోహ ఉంది. అదేమిటంటే, గుడ్లు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ (Cholesterol) పెరుగుతుందని. కానీ ఆధునిక పోషకాహార శాస్త్రవేత్తలు ఈ అపోహను దాదాపుగా తొలగించారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనేది నిస్సందేహం. మరి రోజూ గుడ్లు తినడం నిజంగా సురక్షితమేనా? రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు? ఈ విషయంపై మీకు తెలియాల్సిన ముఖ్యమైన వాస్తవాలు తెలుసుకుందాం.
గుడ్లు పోషకాహార శక్తి కేంద్రాలు ఒక గుడ్డులో అధిక నాణ్యత గల ప్రొటీన్, ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ (ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ D, కోలిన్) మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కండరాల నిర్మాణాన్ని, కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గుడ్ల విషయంలో అతిపెద్ద ఆందోళన దాని పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ గురించి. అయితే, చాలా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ అనేది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో అంత ప్రధాన పాత్ర వహించదు. ఆరోగ్యంగా ఉన్న చాలామంది వ్యక్తులు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం పూర్తిగా సురక్షితం.
ఇది గుండె ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదని తేలింది. నిజానికి, గుడ్లు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అయితే, మీకు ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు, మధుమేహం లేదా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లయితే, మీరు రోజూ ఎన్ని గుడ్లు తినాలి అనేదానిపై వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. అటువంటి సందర్భాల్లో, గుడ్డులోని పచ్చసొన కాకుండా తెల్లసొన ను మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మొత్తంగా, సమతుల్య ఆహారంలో భాగంగా గుడ్లను రోజూ చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
గుడ్ల నుండి ఉత్తమ పోషకాలను పొందడానికి, వాటిని ఉడకబెట్టడం (Boiling) లేదా తక్కువ నూనెతో ఆమ్లెట్ (Omlet) వేసుకోవడం ఉత్తమం. వేయించిన లేదా అధిక కొవ్వు ఉన్న పద్ధతుల్లో వండిన గుడ్లు గుండె ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు.
