చలికాలం అంటే పండుగలు వేడి వేడి ఆహారం స్వెటర్లు గుర్తుకొస్తాయి. అయితే ఈ ఆహ్లాదకరమైన వాతావరణం వెనుక మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలైన మెదడు మరియు గుండెకు ప్రమాదం పొంచి ఉంది. గణాంకాల ప్రకారం చలికాలంలో మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయే స్ట్రోక్ (ఇస్కీమిక్ స్ట్రోక్) ముప్పు గణనీయంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు మన శరీరంలో ఎలాంటి అంతర్గత మార్పులు జరుగుతాయి? స్ట్రోక్ రిస్క్ పెరగడానికి గల 5 ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
చలికాలంలో మెదడు స్ట్రోక్ ముప్పు పెరగడానికి గల ప్రధాన కారణం, రక్తనాళాలపై చలి ప్రభావం. చల్లని వాతావరణం మన రక్తపోటును అమాంతం పెంచుతుంది. చలికి శరీరం స్పందించే క్రమంలో, రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల గుండె ఎక్కువ శక్తిని ఉపయోగించి రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది, ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.

అధిక రక్తపోటు అనేది స్ట్రోక్‌కు నంబర్‌వన్ రిస్క్ ఫ్యాక్టర్. రెండవ ముఖ్య కారణం, రక్తంలో పెరిగే చిక్కదనం. చలి ప్రభావం వల్ల రక్తం కాస్త చిక్కగా మారుతుంది దాంతో రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది. ఈ గడ్డలు మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇరుక్కుంటే, స్ట్రోక్ వస్తుంది. మూడవది శారీరక శ్రమ తగ్గడం. చలికి చాలా మంది ఇంట్లోనే ఉండిపోతారు, శ్రమ తగ్గుతుంది. కదలిక లేకపోవడం వల్ల రక్త ప్రసరణ మందగించి ముఖ్యంగా వృద్ధులలో ప్రమాదం పెరుగుతుంది.
నాల్గవ ప్రధాన కారణం, డీహైడ్రేషన్. వేసవిలో లాగా కాకపోయినా, చలికాలంలో కూడా దాహం తక్కువగా ఉండటం వల్ల నీరు తగినంత తాగరు. దీనివల్ల రక్తం మరింత చిక్కబడి, గడ్డలు ఏర్పడే రిస్క్ పెరుగుతుంది. సరిపడా నీరు తాగకపోవడం స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. ఇక ఐదవ అంశం ఇన్ఫ్లమేషన్. చలికాలంలో ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం.
ఈ ఇన్ఫెక్షన్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి ఇది రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ ఐదు కారణాల వల్ల, ఇప్పటికే గుండె సమస్యలు లేదా అధిక రక్తపోటు ఉన్నవారికి చలికాలం ఒక సవాలుగా మారుతుంది. వెచ్చగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
గమనిక: చలికాలంలో మీ రక్తపోటును తరచుగా పర్యవేక్షించుకోవడం, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం, మరియు స్ట్రోక్ లక్షణాలు (ముఖం వంకరపోవడం, చేయి శక్తి కోల్పోవడం, మాట తడబడటం) గమనిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
